హైదరాబాద్: ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎప్పుడూ తానే పై చేయిగా ఉండే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇప్పుడు తన పాచికలు పనిచేస్తున్నట్లు లేవు. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే....తెలంగాణ ఉద్యమ విషయంలో, తెలంగాణ ఇచ్చే విషయంలో ఎవర్నయితే అధికంగా నమ్మారో వారే ఆయనను నట్టేట ముంచుతున్నారు. కేసీఆర్ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. కేసీఆర్కు జరుగుతున్న వరుస సంఘటనలు కొంత ఇబ్బందికరంగానే మారాయి. తెలంగాణ ఉద్యమ విషయం తీసుకుంటే...ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చనిపోయాక ఆయన స్థానంలో మరో ప్రొఫెసర్ కోదండరాంను తీసుకువచ్చారు. కేసీఆర్ ముందుండి కోదండరాంను తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ గా చేశారు. జేఏసీ ఛైర్మన్ అయిన కోదండరాం కేసీఆర్కు కుడిభుజంగా ఉండేవారు. ఉద్యమ నిర్వహణలో తనకు అండగా ఉంటాడనుకున్న కోదండరాం పాలమూరు ఉప ఎన్నికల్లో తీసుకున్న స్టెప్ కేసీఆర్ ఇప్పటికీ మరిచిపోవడం లేదు. కోదండరాం జేఏసీ ఛైర్మన్గా తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. దీనితో అప్పటి నుంచీ కేసీఆర్-కోదండరాం మధ్య ఆగాధం ఏర్పడ్డది. వారి మధ్య మాటాముచ్చట్లన్నీ బందయ్యాయి. వీరిని కలిపేందుకు మేధావులు, జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కవులు, కళాకారులు చేయనీ ప్రయత్నం లేదు. కోదండరాం ముఖాన్ని కూడా చూడటానికి కేసీఆర్ ఇష్టపడటం లేదనీ అనేక సభలు, సమావేశాలు నిరూపించాయి. జేఏసీ ప్రారంభంలో కేసీఆర్ ఏది చెబితే కోదండరాం అదే చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కేసీఆర్కు సమాచారం లేకుండానే తెలంగాణ మార్చ్ కు పిలుపునిచ్చారు. ఆయన ప్రమేయం లేకుండానే నిర్వహించారు. ఇది వీరిద్దరి మధ్యన మరింత గ్యాపును పెంచి అది ఎంత వరకు దారితీసిందంటే జేఏసీ ఛైర్మన్ పదవీ నుంచీ కోదండరాంను దించేంత వరకు. తమ మధ్యన చిన్న చిన్న బేధాభిప్రాయాలున్నాయనీ కోదండరాం ఒప్పుకుంటున్నా...కేసీఆర్ ఇంత వరకు బయటపడలేదు. ఆయన్ను కలుసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక తెలంగాణ ఇచ్చే విషయంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతో నమ్మారు. ఎవరెన్ని చెప్పినా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందనీ మొన్నటి వరకు తనను కలిసిన వారందరికీ చెబుతూ వస్తున్నారు. అయితే నిన్నటికి నిన్న కేంద్రహోం మంత్రి షిండే తెలంగాణపై మాట్లాడటం లేదన్నారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన గులాంనబీఆజాద్ కూడా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదనీ, అందరితో చర్చలు జరిపినట్లుగానే కేసీఆర్ తో జరిపామనీ, కేసీఆర్ తో ప్రత్యేకంగా జరిపిందేమీ లేదన్నారు. తెలంగాణవాదులు, ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ లోని కొందరు నాయకులు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని అంతగా నమ్మొద్దనీ నెత్తి నోరు కొట్టుకున్నా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగానో నమ్మారు. చివరకు కాంగ్రెస్ నేత ఆజాద్ కూడా అందరిలో ఒకరిగానే కేసీఆర్ ను చూశాడే తప్ప ప్రత్యేకంగా ఆయనో ఉద్యమనాయకుడిగా గుర్తించలేదు. ఏది ఏమైనా కేసీఆర్ ఎంతో నమ్మకమనీ భావించిన కోదండరాం దూరమయ్యారంటే.... కాంగ్రెస్ కూడా తాను ఇప్పటి వరకు జరిపిన చర్చలు, తెలంగాణ వస్తదనీ చెప్పినవన్నీ ఉత్తుత్తి మాటలుగానే కాంగ్రెస్ తేల్చేసింది. ఇలా కోదండరాం, కాంగ్రెస్ ను కేసీఆర్ నమ్ముకుంటే నట్టేట ముంచారనీ తెలంగాణవాదులు చెవ్వులు కొరుక్కుంటున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: